|
|
నీతి కొరకు ఆకలి
మన నీతికిఆధారమైన క్రీస్తు ప్రభువు యొక్క మహిమాన్వితమైన మొదటి రాకడకాంతిలో ఆనందించుచున్న ఆనందవిశ్వాసులారా! మహిమా న్వితుడైనయేసుక్రీస్తు ఆనందకాంతిని మనందరిపై ప్రసరింపజేసి మనలను మహిమానందభరితులనుగా చేయును గాక! ప్రభువు యొక్క పరిశుద్ధ పాదపద్మముల చెంతకూర్చుని, ఆయన రాకడ వాక్యములను ధ్యానించుచున్న మీపై త్రిత్వతండ్రి తన రాకడ మర్మములతో మనఅంతరంగములను నింపును గాక! ఆమెన్.
ఆకలిలేనిదే మనిషికి మనుగడ లేదు. ఆకలిరెండు రకములు. శారీరక ఆకలి (బహిరంగ ఆకలి), మరియు ఆత్మీయఆకలి (అంతరంగ ఆకలి), ప్రియులారా ! అశాశ్వతమైన ఈ లోకంలో ధనము, ఆస్తులను సమకూర్చుకోవడ ము , పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే తపన అనేవి బహిరంగ ఆకలిగాచూడవచ్చు. ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగియున్నామానసిక ప్రశాంతత లేనిదే వాటిని మనం అనుభవించలేము. ఆ మానసిక ప్రశాంతత కొరకు సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని వెదకడం ఆత్మీయ ఆకలిగా గుర్తించవచ్చు. పాప బంధకాలతో బంధింపబడి, అంతుతెలియని రోగాలతో,మానసిక అశాంతితో రగిలిపోతున్నపుడు ఆత్మీయ ప్రశాంతత కొరకు వెదకడమే అంతరంగ ఆకలి. మరిఆ అంతరంగ ఆకలి తీరాలంటే మొదట మనం నీతిమంతులముగా తీర్చబడాలి. మానవులపై దేవుడువిధించిన అతి ప్రాముఖ్యమైన భక్తితో కూడిన అవసరత నీతిగా బ్రతకడమే.
మరి పాపములో పుట్టి, పాపములో జీవిస్తూ దేవునికిఅవిధేయుడుగా జీవిస్తున్నమానవుడు తాను చేసే మంచిపనులను బట్టి, దానధర్మాలను బట్టినీతిమంతుడనయ్యాననుకొనుచూ అపోహ పడుచున్నాడు. మన నీతి క్రియలు మురికిగుడ్డలవలె ఆయెనుఅని యెషయా ప్రవక్త చెబుతున్నాడు. మన నీతి క్రియలు, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు,మరియు ఏ మానవుడూ మనలను నీతిమంతులుగా తీర్చలేరు. మరి మానవుడు నీతిమంతుడు ఎలా కాగలడు? దానికి ఏకైక మార్గం నీతిమంతుడైన యేసుక్రీస్తే.క్రీస్తును వెంబడించువాడు నీతిమంతుడు. అనగా ఇది కేవలం దైవకార్యం. యేసుప్రభువునునమ్ముట ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. (గలతీ 3:6) విశ్వాసము ద్వారా(రోమా 5:1), కృప చేత (రోమా 3:24), యేసు రక్తము వలన (రోమా 5:9), యేసు నామము వలన (1కొరింథి 6:11), దేవుని ఆత్మయందు (1 కొరింథి 6:11), క్రీస్తు యేసు పునరుద్ధానమునుబట్టి (రోమా 4:25), పశ్చాత్తాపముతో పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా (లూకా18:14), యేసు ప్రభువు ఆజ్ఞలకు సంపూర్ణముగా విధేయులమగుట ద్వారా మనం నీతిమంతులముగాతీర్చబడుదుము. నీతిమంతులు దేవుని బిడ్డలు, వారు దేవుని విడువరు, దేవుని స్తుతిస్తారు,విడువక ప్రార్థిస్తారు దేవుని వాక్యమును నమ్మి ఆయన వాక్యంపై ఆధారపడతారు.వాక్యాన్ని విని, చదివి, ధ్యానించి, అంగీకరించి, విశ్వసించి దానిని అవలంబిస్తారు.దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, ఆయన సన్నిధిలో జీవిస్తారు దేవుని యందు భయభక్తులుకలిగి, ఆయన మహిమార్థమై జీవించి ఆయన ఇచ్చే సకలాశీర్వాదాలను ఆనందంతో ఆస్వాదిస్తారు,
ఆయన మనలను అణచని యెడల మనకు ఆకలి కలగదు. ఆకలి లేనియెడలఆహారమును అందుకొనలేము గనుకనే అన్నికాలములలో ఉన్న తండ్రి అందరినీ అణచుచూ, వారికికావాల్సిన పోషణ ఇచ్చుచూ బలపర్చుచూ ఉన్నారు. ఇశ్రాయేలీయులను 40సంవత్సరములుఅవిశ్రాంతముగా పరలోకపు ఆహారమిచ్చి పోషించారు. ఏదేను మొదలుకొని, నూతనయెరూషలేము వరకు ఉన్నవారిని ఆయనే వారి వారి అంతస్తులను బట్టి పోషించుచున్నాడు. ఎన్నివిధములుగా నిన్ను నలుపవలెనో అన్ని విధములుగా ఆయన నిన్ను అణచినప్పుడు, నీకుఎన్నడూ లేనంత ఆకలి కలుగుతుంది. భూమ్యాకాశములు కూడా ఆ ఆకలిని తీర్చలేవు. అంత పెద్దఆకలి నీకు కలుగుతుంది. గనుక ఆయన నిన్ను అణచినప్పుడు నీకు మొదటిగానీతికొరకు ఆకలివేయును.
1. నీతి కొరకు ఆకలి (మత్తయి 5:6) : నీతికొరకు ఆకలిదప్పులుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని మనప్రాణప్రియుడు కొండమీది ప్రసంగములో బోధించాడు. పరిశుద్ధులుగాదేవుని చెంతనుండి, క్రీస్తునుపోలి, పరిశుద్ధాత్మతోనిండి ఉండడమే నీతిమంతులుగా ఉండడము. నీతిమంతులుగా ఉండవలెనంటేపాపములను విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపము దేవుని నుండి దూరము చేసి మనజీవితములో పరిశుద్ధాత్మను పనిచేయనీయదు.(ఎఫెసీ 4:30).నీతి అనగాక్రీస్తు నీతి, క్రీస్తు పరిశుద్ధత. నీతి కొరకు ఆకలి అనగా ఆయన నీతిజీవితము కొరకైన ఆకలి. నీవు ఎప్పుడైతే, ఆయనచేతిలో నలపబడతావో, అణచబడతావో అపుడు నీలోని దుర్నీతి నశించి, స్వనీతిరాలిపోయి, క్రీస్తు నీతిని ధరించుటకొరకైన ఆకలి నీలో వేగిరముగా పుట్టును. క్రీస్తుసహవాసములో తప్ప మరెక్కడా నీకు క్రీస్తు నీతి దొరకదు. గనుకక్రీస్తుతో అన్యోన్య సహవాసములోనికి వెళ్ళుటకును (యోహాను 1:7),అక్కడఆయనను చూచుటకును, ఆయన మాటలు వినుటకును, ఆమాటలలోని నీతిని ధరించుకొనుటకును నీకు ఆకలి పుట్టును. ఇదియేక్రీస్తు నీతికొరకైన ఆకలి. రెండవదిగా నీవు ఎపుడయితే ఆయన చేత అణచబడతావోఅప్పుడు నీలో ఉన్న మూర్ఖత్వము, అవిశ్వాసము రాలిపోవును గనుక నీ ప్రభువుమీదే మరింతగాఆనుకొనుటకునూ, అన్నిటికంటే నీ ప్రభువునే ఎక్కువగా నమ్ముటకును నీకు ఆకలి పుట్టును. కనుకప్రతి చిన్న పనికి, ప్రతి చిన్న కదలికలోను నీ ప్రభువు మీదఆనుకొనుటకు నీకు ఇష్టము పుట్టును. ఇట్టి అనుభవము అబ్రహాముజీవితములో ఉన్నది గనుకనే “అబ్రహాము దేవుని నమ్మెను అదిఅతనికి నీతిగా ఎంచబడెను” (యాకోబు 2:23)అనిపరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అబ్రహాము నమ్మికే అతనిజీవితములోని నీతి. గనుక ఆయనను నమ్మియుండుటలో మనమెంత ఆకలిగొనియుందుమో అంతగా నీతిమంతులుగా తీర్చబడెదము అనగా అంతగా ఆయన నీతిచేత పోషించబడెదము, నింపబడెదము. అదేక్రీస్తు సిలువ నీతి .
2. ప్రార్థించుట కొరకు ఆకలి : (అ.కా.10:9,10) : ప్రార్థన అంటే దేవునితోసంభాషించుట, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట. మాటల్లోనూ,మౌనంలోనూ వ్యక్తమయ్యే ఆత్మలోని తృష్ణే ప్రార్థన.
ప్రార్థన మనం దేవునితో మాట్లాడటానికి, మనసు విప్పి ఆయనతోసంభాషించటానికి, మన ఆత్మలోని ఆరాటాన్ని తెలిపి ఆయనలో లీనం కావడానికి దోహదంచేస్తుంది. వ్యక్తిగత జీవిత భౌతిక, ఆత్మీయఅభివృద్ధికి, సంఘ అభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనేఆధారం. ప్రపంచంలో ఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి. గొప్ప దైవజనుల విజయరహస్యం ప్రార్థనే. మన జీవితంలోని ప్రతి విషయంలోనూ ఆయన చిత్తానికిలోబడి జీవించాలంటే దేవునితో సహవాసం కలిగి, ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో అంటుకట్టబడిఫలభరితమైన జీవితం కొరకు ఆకలి కలిగియుండాలి. సీమోను ఇంట దిగియున్న పేతురుకుమధ్యాహ్నపు వేళ ఆకలికాగానే ఆయన ప్రార్థించుటకుపైకి వెళ్ళెను. అనగా పేతురు తన బహిరంగ ఆకలిని, అంతరంగఆకలిగా మార్చుకొన్నాడు. అనగా ప్రార్థించుటకు ఆకలిగొని, ఆశతీరాప్రార్థించాడు. ఆ ఆకలి ప్రార్థన పరలోకమును తన ముందుకుదించివేసింది. అనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి పాత్ర ఆయన ముందుకుతేబడెను. మానవుల రక్షణకొరకైన ఆకలిగొని, సిలువపై ప్రభువు చేసిన మొదటిప్రార్థన సర్వ మానవులకు క్షమాపణను ప్రసాదించి, ఈ పెద్దదుప్పటివలె తన క్షమాపణ పాత్రలో వారిని దాచి ఉంచి కప్పివేసింది. గనుకప్రార్థనకొరకైన ఆకలి సకలాశీర్వాదములను మన ముందుకు దింపివేస్తుంది. ఓవిశ్వాసీ! ఆయన తన చిత్తములో నిన్ను అణచనిదే నీకు ఆ ప్రార్థనాకలి ఏలాగు కలుగగలదు. గనుకప్రార్థించుట కొరకైన ఆకలి కలిగి ఉండుటకు ఆత్మ తండ్రిని వేడుకొనుము
3. వాక్యము చదువుట కొరకైన ఆకలి : (కీర్తన 119:131):‘నీ ఆజ్ఞలయందైన అధిక వాంఛచేత నేను నోరు తెరచిఒగర్చుచున్నాను’. దేవునిహృదయానుసారి అయిన దావీదు ఆయన ఆజ్ఞలు గల ధర్మ శాస్త్రము చదువుట కొరకైన అధిక వాంఛచేతనోరు తెరచి ఒగర్చుచున్నానని వ్రాయుచున్నాడు. బాగా పని చేసినవారు అలసిపోయిముందుగా దప్పిక తీర్చుకొని, ఆ తదుపరి కడుపునిండా భోజనము చేయురీతిని నీధర్మశాస్త్రమును ఆకలి దప్పికలు లేకుండా దివారాత్రులు ధ్యానించుటకు (కీర్తన 1:2)నేనుఆకలిగొనియున్నానని తెలియజేయుచున్నాడు. గనుక నరుడు రొట్టెవలన మాత్రముకాదు గానీ, దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును. (ద్వితీ 8:3)అనివ్రాయబడిన ఈ వాక్యధ్యాన ప్రకారము ఆయన వాక్యము కొరకైన ఆకలి మాత్రమే మనిషినినిజముగా జీవింపజేయును. నిజముగా బ్రతికించును. (కీర్తన 119:50)గనుక ప్రియవిశ్వాసీ! వాక్యముకొరకైన ఈ ఆకలి నీవు కలిగి యుండగలవా? ఈ ఆకలికలిగియుండిన యెడల నీ మాటలు నాకు దొరకగా నేను భుజించితిని (యిర్మియా 15:16)అనిపలికిన ప్రవక్తవలెనే నీవును చెప్పగలవు. ఆయన వాక్యము కొరకైన ఆకలిని బాగాకలిగియున్న ఆ ప్రవక్తకు ఆయన మాటలు దొరకగానే ఆయన వెంటనే వాటిని భుజించెను. అట్టిసుభోజనముగా ఆయన ఆకలి తీర్చుకొను ఆహారముగా తన వాక్యమును ఆత్మతండ్రి మనకు అనునిత్యమువడ్డించునుగాక ! ఆమెన్.
4. ఆయన శరీర రక్తముల కొరకైన ఆకలి : (లూకా 6:21;22:15) ప్రభువు సంస్కారపు ఆరాధనలో ‘మీరు ఆకలిగొని వచ్చిన యెడల మీరాకఎంతో మంచిది, అని వ్రాయబడినది. అలాగుననే మన ప్రభువును ‘ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు’ అనిపలుకుచున్నాడు. అది ఆయన శరీరరక్తములకొరకైన ఆకలే. గనుకనే ఆయన నా శరీరము తిని నా రక్తముత్రాగువాడే నిత్య జీవము గలవాడని చెప్పుచూ, ఆ నిత్య జీవము కలిగించు శరీరరక్తముల కొరకైన ఆకలిని మనము కలిగి ఉండవలసిన వారముగా తన జీవములో నుండి మనకుజ్ఞాపకము చేయుచున్నాడు. గనుకనే నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈపస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అనగా ఆకలిగొని యుంటిని అని (లూకా 22;15) చెప్పుచున్నాడు. ప్రియుడా ! ఇట్టిఆకలిని నీవు కలిగి ఉండగలవా? “ఎప్పుడెప్పుడు నీలోనికి వచ్చెదనా? ఎప్పుడెప్పుడునా శరీర రక్తముల ద్వారా నీ ఆకలిని తీర్చెదనా”? అని నీప్రాణ ప్రియుడు నీ ఆకలి తీర్చుటకు ఆకలిగొనియుండగా, ఆయన ఆకలితీర్చుట కొరకు ఆయన శరీర రక్తములకొరకైన ఆకలి నీవు కలిగియుండవా? ఇట్టిఆకలిని ఆత్మ తండ్రి నీకు కలగించి, నిన్ను తన శరీర రక్తములతోపోషించును గాక ! ఆమెన్.
5. సువార్త ప్రకటించుటకొరకైన ఆకలి : (1 కొరింథి 4:11)‘అయ్యో ! నేను సువార్తను ప్రకటించకపోయినయెడల నాకు శ్రమ’ అని అపోస్తలుడైన పౌలు సువార్త కొరకైనఆకలిగొని అంతటనూ సువార్తను ప్రకటించాడు. సువార్తకొరకైన ఆకలి విరివిగాకలిగియున్నందుననే ఈ లోకమందున్న తన ఆకలి దప్పికలను పట్టించుకొనక, సమయమందును, అసమయమందును సువార్తను ప్రకటించెను. ప్రయాణములలోప్రకటించాడు, మేడలమీద, కోటలలో, గృహము లలో, పొలములలో, సముద్రపు టొడ్డున ఈ లాగునఅపోస్తలుడైన పౌలు క్రీస్తు సువార్తను అన్ని స్థలములలో, అన్నివిధములుగా ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటించుటకై ఆయనలో ఉన్న ఆకలిఅంత గొప్పది గనుకనే ‘నేనైతే క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తనుప్రకటించవలెనని మిక్కిలి ఆశగల వాడనై యుండి (మిక్కిలి ఆకలిగొని), ఆలాగునప్రకటించితిని’ (రోమా 15:20-21)అనివ్రాయుచున్నాడు. నీవు ఆయన సువార్తను ఆలాగున ప్రకటించని యెడల ఆయనదప్పికను, ఆకలిని ఏలాగున తీర్చగలవు. ఆయన రాకడ సువార్తను ప్రకటించుటలో అటువంటిఆకలిని ఆయన మీలో పుట్టించి, తన రాకడ మర్మములతో నిన్ను పోషించునుగాక ! ఆమెన్
6. ఆత్మఫలములకొరకైన ఆకలి : (మత్తయి 21:18)నీ ప్రాణప్రియుడు ఈ లోకములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అను అంజూరపు చెట్టున ఫలములు ఆశించి, వారినుండిఆచారములను ఆకులు తప్ప మరేమియు కనుగొన లేకపోయెను. గనుకనేఆత్మపలముల కొరకైన నీ ప్రాణప్రియుని ఆకలిని తీర్చుటకు ‘కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి’(1 కొరింథి 12:31) అని పరిశుద్ధాత్మ తండ్రివ్రాయించాడు. ఆసక్తితో అనగా ఆకలితో అపేక్షించుడి అని భావము. గనుక ‘ అతని ఫలము నా జిహ్వకు మధురము (ప.గీ 2:3)అనిపలుకుచున్న పరమగీతములోని పెండ్లికుమార్తెవలె ఆయన ఆత్మఫలముల కొరకు మనము ఆకలిగొని, వాటిలోనిమధురమైన మహిమా స్థితితో మన ఆకలి తీర్చుకొనవలెను. ఆయనఆత్మఫలములకొరకు ఆది సంఘము ఆకలిగొనినందున శరీరాకలి, దప్పికలుమరచిపోయి, 10 దినములు ఏకాగ్రతతో ఆయన ఆత్మ ఫలములు, వరముల కుమ్మరింపు కొరకుకనిపెట్టు కొనిరి. అట్టి కనిపెట్టు ఆకలిని ఆత్మతండ్రి మనలోరగిల్చి, తన ఆత్మవరముల, ఫలములవిందుతో మనలను పోషించునుగాక ! ఆమెన్.
7. ఆయనను చూచుటకొరకైన ఆకలి : (కీర్తన 63:2)‘ నీమీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరముకృశించుచున్నది’ అని దైవజనుడైన దావీదుపలుకుచున్నాడు. ‘జీవముగల దేవుని దర్శించుటకు నాహృదయము ఆనందముతో కేకలువేయుచున్నది’ అని వ్రాసిన ఆయనే, ఆయననుచూచు ఆకలితో, ఆశతో తన శరీరము కృశించిపోవుచున్నది. అనగా ఎండిపోవుచున్నది, శుష్కించిపోవుచున్నదిఅని పలుకుచున్నాడు. ప్రియ విశ్వాసీ ! ఇట్టిఆకలి నీవు కలిగియుండ గలవా? ఇదే అన్నిటికన్న గొప్ప ఆకలియై యున్నది. ‘నేను మేల్కొనునప్పుడు ప్రతి దినము నీ స్వరూప దర్శనముతో నా ఆశ (ఆకలి) తీర్చుకొందునని’(కీర్తన 17:15) ఈ దైవజనుడేసాక్ష్యమిచ్చుచున్నాడు. ఇట్టి నిజమైన ఆకలి నీవు కలిగియున్నయెడల ‘యదార్థవంతులు ఆయన ముఖదర్శనము చేయుదురు’ అను వాగ్దానమునుస్వతంత్రించుకోగలవు. (కీర్తన 11:7). అట్టి ధన్యస్థితితో ఆత్మ తండ్రిమనందరినీ పోషించునుగాక ! ఆమెన్.
Categories: INSPIRIED MESSAGES
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.